Thursday, March 12, 2026

*మందోట ఉన్నా నడి ఊర్లోనే పశువుల మంద** చర్లపల్లిలో పరిశుభ్రతకు భంగం.. ప్రజలకు ఇబ్బందులు* మందోటకు తరలించాలని గ్రామస్థుల డిమాండ్*

నేటి సాక్షి, ఎండపల్లి:* పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వాలు పలు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ఇందుకు భిన్నంగా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామం నడిబొడ్డున పశువుల మంద పోగవడంతో గ్రామం అపరిశుభ్రంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఉదయం గ్రామం మధ్యలో ఉన్న పూర్వపు మర్రిచెట్టు వద్దకు ఆవులు, బర్రెలను తరలించి కొద్ది గంటలపాటు సమూహంగా నిలిపివేస్తుండటంతో అక్కడి పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా మారుతోందని గ్రామస్థులు తెలిపారు. ఊరి రచ్చబండగా పేరొందిన ఈ ప్రదేశం పశువుల మందతో మురికిగా మారుతుండటంతో పెద్దలు సేదతీరే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. పశువుల విసర్జనల వల్ల దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమలు, ఈగలు పెరిగి గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డునే పశువులను పోగు చేయడంతో శుభ్రత దెబ్బతింటోందని, వర్షాలు పడే సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కొద్ది రోజులపాటు పశువులను గ్రామానికి బయట ఉన్న మందోటకు తరలించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయాయని, ప్రస్తుతం మళ్లీ మర్రిచెట్టు కిందనే పశువులను నిలిపివేయడంతో సమస్య తలెత్తిందని గ్రామస్థులు పేర్కొన్నారు. పశువుల మంద నిర్వహణకు ప్రత్యామ్నాయంగా మందోట ఉన్నప్పటికీ అక్కడికి తరలించకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పశువుల మందను మందోటకు తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హెచ్చరించారు.*మంద తరలింపుకు చర్యలు తీసుకుంటాం*- పం. కార్యదర్శి తిరుపతి రెడ్డిదీనిపై నేటి సాక్షి ప్రతినిధి గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 99 రోజుల ప్రణాళికలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో పశువుల మందను గ్రామం బయట ఉన్న మందోటకు తరలించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News