– రాబోయే కొత్త విత్తన చట్టంలో రైతుకు భద్రత కల్పించాలి.
– తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కలిసిన…
– నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్.
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల: జిల్లాలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేస్తున్న రైతులను అనేక రకాలుగా మోసానికి గురిచేస్తున్న మధ్య దళారుల దోపిడిని అరికట్టి రైతుకు న్యాయం చేయాలని ఈరోజు హైదరాబాదులోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు సభ్యులు కెవి. నరసింహారెడ్డి, భవాని రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి మరియు వీరితో పాటు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గార్లను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
విత్తన పత్తిని సాగుచేస్తున్న రైతులను కంపెనీలు మరియు ఆర్గనైజర్లు అనేకరకాలుగా మోసానికి గురిచేసి రైతులను నిండా ముంచుతున్నారని, దీంతోపాటు రైతులు భూములను కోల్పోయారని,రైతులకు న్యాయం జరగడం కోసం రాబోయే కొత్త విత్తనచట్టంలో రైతుకు భద్రత కల్పించాలని కోరారు.
రైతులు పండించిన పంటను జీఓటీ ఫలితాలతో సంబంధం లేకుండా, పాస్ మరియు ఫెయిల్ తో సంబంధం లేకుండా, ఫెయిల్ అయిన రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని, అలాగే మూడు నెలలలోపే పేమెంట్ పూర్తి చేయాలని, మధ్యవర్తులతో ఎలాంటి సంబంధం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మధ్య దళారుల దోపిడీ లేకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా పారదర్శకత ఉండేటట్లు రాబోయే కొత్త విత్తన చట్టంలో రైతుకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న నాయకులు చిన్న రాముడు, భూపతి నాయుడు నేతన్న,తదితరులు పాల్గొన్నారు.

