-అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 7
మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి స్వామి వారి శేష వాహన సేవ పవిత్ర పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం గర్భగుడి నుండి శోభాయ మానంగా అలంకరించిన శేష వాహనంపై స్వామివారిని దేవస్థానం ముందున్న రథమండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురు, భక్తుల హరినామశ్చరణల మధ్య స్వామి వారి పవిత్ర ఈ సేవ ముందుకు కదిలింది. అనంతరం మండపం వద్ద స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని మళ్లీ శేష వాహనంపై గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు శేష వాహనంపై దేవస్థానం పురవీధుల గుండా ఊరేగుతూ భక్తకోటికి దర్శనం ఇచ్చారు. స్వామి వారిని చూసి వివిధ ప్రాంతాలనుండి తరలి వచ్చిన భక్తులు తన్మయం చెందారు. భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. విశేష దినోత్సవం సందర్భంగా స్వామిరిని రకరకాల పూలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఈ సేవా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాస రాజు, ప్రధాన పూజారులు రాజేష్, నరసింహయ్య, పాలకమండలి సభ్యులు, పర్యవేక్షకుడు నిత్యానంద చారి లతో పాటు దేవస్థానం సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, దేవస్థానం పురోహితులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.