మహబూబాబాద్ ఫిబ్రవరి 7మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవి రాథోడ్ శనివారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం బెతోల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, అవసరమైన ఔషధాల నిల్వ, వివిధ ప్రజారోగ్య కార్యక్రమాల అమలు స్థితిని ఆయన పరిశీలించారు.ప్రధానంగా తల్లీ–శిశు ఆరోగ్య సేవలు, గర్భిణీలకు అందుతున్న వైద్య సంరక్షణ, టీకాల కార్యక్రమం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సేవలు గ్రామ స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలవ్వాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.డీఎంహెచ్ఓ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమై స్థానిక ప్రజల ఆరోగ్య అవసరాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని సమీక్షించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని తెలిపారు.రికార్డుల నిర్వహణను సక్రమంగా చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలను కోరారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రక్తహీనత ఉన్న గర్భిణీలను గుర్తించి ఐరన్ మాత్రల వినియోగం తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి, గుర్తించిన వారికి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ అర్జున్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





