.నేటి సాక్షి వికారాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో స్థానిక మహావీర్ మెడికల్ కాలేజీలో మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ముఖ్య అతిథిగా, వికారాబాద్ మునిసిపల్ చైర్మెన్ శ్రీమతి గడ్డం అనన్య గౌరవ అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు తమపై తాము నమ్మకాన్ని పెంచుకుని, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళలు, చిన్నారులు వృద్ధుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, మహిళలు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. ప్రతి మహిళా తన హక్కులపై, తమ రక్షణ కోసం ఉన్న చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యంగా ఈవ్ టీజింగ్, సైబర్ వేధింపులు వేధింపుల నివారణకు ‘షీ టీమ్స్’ (షీ టీమ్స్ ) నిరంతరం నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా తక్షణమే డైల్ 100 లేదా షీ టీమ్ నంబర్లకు సమాచారం అందించాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు.అనంతరం ఎస్పీ విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళలు, పిల్లలు వృద్ధులపై జరిగే ఎలాంటి వేధింపులనైనా సహించబోమని, అన్యాయం జరిగినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యతాయుతంగా స్పందిస్తామని విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకల్లో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రేణుకా దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) స్వర్ణలత, జిల్లా సంక్షేమ అధికారి (DWO) కృష్ణవేణి, మహిళా పిఎస్ ఇన్‌స్పెక్టర్ సరోజ, మహావీర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బాస్కర్ రాజు , షీ టీమ్ సిబ్బంది, వైద్య విద్యార్థినులు, జిల్లా పోలీస్ శాఖ లోని ఉమెన్ అధికారులు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




