Monday, March 9, 2026

మహిళా నాయకత్వమే సమాజ అభివృద్ధికి బాట

నేటి సాక్షి గజ్వేల్ : మహిళలు సంకల్పంతో ముందుకు సాగితే అద్భుత ఫలితాలు సాధించగలరని కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా గౌరారంలోని కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో “శక్తి నేషనల్ లీడర్‌షిప్ కాంక్లేవ్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖ మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యార్థులు, అధ్యాపకుల్లో స్ఫూర్తి నింపేలా ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. మహిళా నాయకత్వం, ఆత్మస్థైర్యం, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను ప్రస్తావిస్తూ కార్యక్రమం కొనసాగింది. విద్య, ఉపాధి, నాయకత్వంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తేనే సమాజ అభివృద్ధి సాధ్యమని డా. ప్రవీణ్ రావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆభాస రిహాబ్ సెంటర్ డైరెక్టర్ గాయత్రి అరవింద్, ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మంజుల రావు, ఐసీఏఆర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త కెబిఆర్ఎస్ విశారద, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత సోఫియా సూఫీ, స్ట్రాటజీ అండ్ బిజినెస్ మాజీ సీఈఓ వైశాలి నియోజియా, క్లాసికల్ డ్యాన్సర్ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత విదూషి దీక్షలను డాక్టర్ ప్రవీణ్ రావు సత్కరించారు.అతిథులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఆరోగ్యం, స్వస్థత, సహానుభూతి ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల స్వాతంత్ర్యానికి ఆర్థిక సాధికారత కీలకమని తెలిపారు. యువతులు ఆర్థిక అక్షరాస్యతపై దృష్టి పెట్టి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలకు లింగభేదం ఉండదని, ఆత్మవిశ్వాసం ఉంటే శారీరక, మానసిక అడ్డంకులను అధిగమించగలమని తెలిపారు.విద్యార్థిని అంజలి బృందం స్త్రీతత్వాన్ని కీర్తిస్తూ చేసిన సాంస్కృతిక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ భాస్కర రావు కార్యక్రమ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పోలసాని, డీన్స్ డాక్టర్ కొండ శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News