నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)మహిళా జట్టు విజయం సాధించాలని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్న క్రీడాకారులుతిరుపతి,నవంబర్ 1:ఉమెన్స్ బిసిసిఐ క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టుపై ఘనవిజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్న భారత మహిళా జట్టు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా తప్పక విజయం సాధిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసిఏ) జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్(క్రికెట్ విజయ్) ధీమ వ్యక్తం చేశారు. శనివారం అలిపిరి శ్రీవారి పాదాల చెంత మహిళా భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్స్ లో విజయం సాధించాలని ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ విజయ్ మాట్లాడుతూ బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లలో ఐదు మ్యాచ్ లు విశాఖపట్నంలో జరిగేందుకు ఏసిఏ అధ్యక్షులు కేసునేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సాన సతీష్ బాబు ఎంతో కృషి చేశారన్నారు. అందులో మన మహిళా భారత జట్టు ఎక్కువ మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడటం నిజంగా గొప్ప విషయం అన్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో ఆడేందుకు వచ్చిన మహిళ క్రికెట్ జట్టుకు రాష్ట్ర మహిళ క్రికెట్ క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆదరించి గ్రౌండ్లో వారికి మరింత ఉత్సాహాన్ని అందించడం శుభపరిణామం అన్నారు. భారతదేశ ప్రజల ఆశీర్వాదంతో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో 338 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి భారత మహిళా జట్టు ఫైనల్స్ చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్లో కూడా భారత మహిళా జట్టు తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత మహిళల జట్టు విజయం రాష్ట్ర మహిళా క్రికెటర్లలో ఎంతో ఉత్సాహాన్ని పెంచిందని, రానున్న రోజులలో ఆంధ్ర రాష్ట్రం నుంచి మరింత మంది మహిళలు భారత జట్టులో తప్పక ఆడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీఫైనల్ మ్యాచ్లో 4.9 ఎకానమీతో కీలకమైన రెండు వికెట్లు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కడపకు చెందిన శ్రీ చరణి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలియజేశారు. అందులో భాగంగానే నేడు ఏసీఏ, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి మొక్కుకోవడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మహిళా జట్టు వరల్డ్ కప్ ఫైనల్స్ లో విజయం సాధిస్తుందని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస మూర్తి, కార్యదర్శి సతీష్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, మెంబర్లు మార్కండేయులు, సత్య శ్రీనివాస్, దివాకర్, నరసింహ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు,మధు రాయల్, కోచ్ లు చిన్నబాబు, అనిత, చంద్రిక, ఉమెన్స్ క్రికెటర్స్ జ్యోతి, రెడ్డమ్మ, సీనియర్ క్రికెటర్లు కిరణ్, రమణ, కపిల్, వాసుదేవ రెడ్డి, టీఎస్ ప్రసాద్, నవీన్,ఉమాశంకర్, పెద్ద సంఖ్యలో మహిళా క్రికెటర్లు, మెన్స్ క్రికెటర్లు తదితరులు పాల్గొన్నారు.





