*నేటి సాక్షి, ఎండపల్లి:* చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మాజీ సర్పంచులను వెల్గటూర్ పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తమకు రావలసిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఉమ్మడి వెల్గటూర్ మండలం నుండి మాజీ సర్పంచులు హైదరాబాద్ కు తరలి వెళ్లేందుకు సిద్ధమైన వేళ వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి రెండేళ్లు అవుతోందని ప్రభుత్వం నుండి రావలసిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదికి వస్తుందని వాపోయారు. పైగా బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అన్యాయం అని పేర్కొన్నారు. తమ గోడును వినిపిస్తే అసెంబ్లీ సమావేశాల్లో నైనా చర్చించి న్యాయం చేస్తారని ఆశతో వెళుతున్న తమను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని మాజీ సర్పంచులు అనుమండ్ల తిరుపతి, గంగుల నాగేష్, కొప్పుల విద్యాసాగర్, బోడకుంటి రమేష్, మెరుగు కొమురయ్య, చల్లూరి రామచంద్రం, మెతుకు స్వామి, గాగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, దుర్గం తిరుపతి తదితరులు డిమాండ్ చేశారు.

