నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల నియోజకవర్గం ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి గురువారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం చేపట్టే సస్య రక్షణ చర్యలను రైతులకు వివరించారు. ప్రస్తుతం మామిడి తోటలు పిందె కట్టే దశలో ఉన్నాయని ఈ సమయంలో నీటి ఎద్దడికి గురిచేయకుండా సక్రమంగా నీటి తడులు అందించాలన్నారు. లేనిచో కట్టిన పిందె రాలిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తేనెమంచు పురుగు, తామర పురుగు వంటి రసం పీల్చు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న తోటల్లో ఇమిడాక్లోప్రిడ్ 4ml లేదా తయోమెథక్సిమ్ 4గ్రాములు,వేపనూనె (10000ppm ) 20 ml 10 లీటర్ల నీటికి కల్పి స్ప్రే చేయాలన్నారు.బూడిద తెగులు ఆశించిన తోటలకు హేగ్జాకోనాజోలు 20 ml 10 లీటర్ల నీటికి కల్పి స్ప్రే చేయాలన్నారు.బఠాణి సైజు దశలో పిందె రాలడాన్ని నివారించుటకు ప్లానోఫిక్స్ అనే హార్మోనును 2.5ml 10 లీటర్ల నీటికి కల్పి స్ప్రే చేయాలని సూచించారు. పిందెలు నిమ్మకాయ సైజు దశలో ఉన్నప్పుడు కాయ సైజు త్వరగా పెరగడానికి 13-0-45 100 గ్రాములు 10 లీటర్ల నీటికి కల్పి స్ప్రే చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో ఉద్యాన విస్తరణ అధికారి రాజేష్ మరియు రైతులు పాల్గొన్నారు.





