నేటి సాక్షి గజ్వేల్ :–తల్లిదండ్రులకు పిల్లలు ప్రాణాల కంటే ఎక్కువ. అలాంటి తమ చిన్న కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన స్వామి–కవిత దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు.చిన్న వయస్సులోనే వారి చిన్న కుమారుడికి కిడ్నీ మరియు లివర్ తీవ్రంగా దెబ్బతినడంతో జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుందేమో అన్న భయంతో కుటుంబం రోజూ ఆవేదనలో గడుపుతోంది. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల తలుపులు తట్టుకుంటూ తమ బిడ్డ బతికిపోవాలని ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం వారానికి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలిసిస్ చేయిస్తున్నారు. ప్రతి సారి డయాలిసిస్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రుల గుండెల్లో భయం, ఆశ కలిసి మెలిసి కన్నీళ్లుగా మారుతోంది.వైద్యుల మాటలు మాత్రం మరింత భారంగా మారాయి —బాలుడు బతికే అవకాశం ఉండాలంటే కిడ్నీ, లివర్ మార్పిడి చికిత్సలు అవసరమని, అందుకు సుమారు రూ.45 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు.తమ బిడ్డ కోసం స్వామి–కవిత దంపతులు ఇప్పటికే తమ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మేశారు.ఇప్పుడు వారి చేతిలో మిగిలింది కేవలం నివసిస్తున్న ఇల్లు మాత్రమే…“డబ్బు లేక మా బిడ్డను కోల్పోవాలా?” అనే ప్రశ్న వారిని ప్రతి రోజు వేధిస్తోంది.రోజురోజుకు బాలుడి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, తమ కుమారుడిని కాపాడేందుకు ప్రభుత్వం గానీ, దాతలు గానీ ముందుకు రావాలని వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు.“మా బిడ్డకు మరో జీవితం ఇవ్వండి…అతను కూడా ఇతర పిల్లల్లా నవ్వుతూ జీవించాలి…”అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతంగా విజ్ఞప్తి చేస్తున్నారు.మనసున్న ప్రతి ఒక్కరూ స్పందించి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని కుటుంబం ఆశతో ఎదురు చూస్తోంది.





