నేటి సాక్షి మహబూబాబా ద్ ఫిబ్రవరి 5 డోర్నకల్ నియోజకవర్గం మరియు మరిపెడ మండలం కేంద్రంలో మాజీ మంత్రి డి ఎస్ రెడ్యానాయక్ ప్రచారం చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో మళ్లీ దొంగ హామీల రాజకీయాలకు తెరలేపిందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. గత 26 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త వాగ్దానాలతో ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోందని ఆరోపించింది.రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు, రైతుబంధు సకాలంలో అమలు, వరి పంటకు రూ.500 బోనస్ వంటి కీలక రైతు హామీలు నేటికీ నెరవేరలేదని బీఆర్ఎస్ గుర్తు చేసింది. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం, చెరువులు నింపకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని పేర్కొంది. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు ఇవ్వకపోవడం, వేళాపాళా లేని విద్యుత్ కోతలు రైతులపై చేసిన ఘోరమని విమర్శించింది.మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెన్షన్లను రూ.4,000కు పెంపు, ఫ్రీ బస్సు, కల్యాణలక్ష్మి, దివ్యాంగుల పెన్షన్లు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించింది. యువతకు నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్, విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, విద్యా భరోసా కార్డు వంటి హామీలను పూర్తిగా విస్మరించారని తెలిపింది.నేతన్నలు, ఆటోడ్రైవర్లు, కూలీలు, దళితులు, గిరిజనులు ఇలా ఏ వర్గానికీ కాంగ్రెస్ పాలనలో న్యాయం జరగలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సు పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప, వాస్తవంగా జీవన భద్రత కల్పించలేకపోయారని విమర్శించింది.కాళేశ్వరం, మిషన్ భగీరథ, వంటి కీలక అభివృద్ధి ప్రాజెక్టులను అర్థాంతరంగా నిలిపివేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్లిందని పేర్కొంది. టీఎస్ ఐపాస్‌ను పక్కనపెట్టి కొత్త పాలసీల పేరుతో పరిశ్రమలను భయపెట్టడం వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించింది.మానిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలు ఇచ్చి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించకపోవడం ప్రజా విశ్వాసానికి ద్రోహమని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. గత హామీలను అమలు చేయకుండానే మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త హామీలు ఇవ్వడం మోసపూరిత రాజకీయమని పేర్కొంటూ, ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ దొంగ హామీలను తిరస్కరించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి రాకేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గడ్డం వెంకన్న బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు





