నేటి సాక్షి వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మాట్లాడారు.ఈ సందర్భంగా ఓట్లు లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్‌వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై సమగ్రంగా సూచనలు చేశారు.ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి, సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, తదుపరి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని, మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, అనుమతి పొందిన వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుందని స్పష్టం చేశారు. లెక్కింపు సిబ్బంది సమయానికి కేంద్రాలకు హాజరై తమ విధులను బాధ్యతా యుతంగా నిర్వర్తించాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా నాలుగు మున్సిపల్ కమిషనర్ లతో కౌంటింగ్ ఏర్పాట్ల పై వివరాలు అడిగి తెలుసు కున్నారు. జిల్లా ఎస్ పి స్నేహ మెహర మాట్లాడుతూ స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, డి ఎస్ పి లను ఏర్పాటు చేస్తూ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సుధీర్,వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్,మున్సిపల్ కమిషనర్లు,తహసీల్దార్ లు స్పెషల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

