*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాహనాల వినియోగానికి ముందుగా సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ప్రచార వాహనాల ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు తావు లేకుండా, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు భంగం కలగకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.*డాక్యుమెంట్లు తప్పనిసరి*ప్రచార వాహనానికి అనుమతి పొందాలంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఫిట్నెస్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాహనం నడిపే డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ప్రచార సమయంలో లౌడ్ స్పీకర్ వినియోగించాలంటే సంబంధిత డీఎస్పీ కార్యాలయం నుంచి ముందస్తు ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థి పూర్తి వివరాలు, పార్టీ వివరాలు కూడా అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.*టిపిఓ కార్యాలయంలో అప్లికేషన్*పై అన్ని డాక్యుమెంట్లను సమగ్రంగా సేకరించిన అనంతరం, ప్రచార వాహనాన్ని వినియోగించనున్న అభ్యర్థి వివరాలు, పార్టీకి సంబంధించిన సమాచారంతో కలిసి కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) కార్యాలయంలో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్లికేషన్‌ను పరిశీలించిన అనంతరం ఎన్నికల నిబంధనల మేరకు ప్రచార వాహన వినియోగానికి అధికారిక అనుమతి మంజూరు చేయబడుతుందని తెలిపారు. అనుమతి లేకుండా వాహనాలను ఉపయోగించిన పక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.________





