ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోహణ-2025 కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
రామచంద్రపురం
కుప్పం బాదూరు, జులై 8 : మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
మంగళవారం రామచంద్రపురం మండలం, కుప్పంబాదురు సమీపంలోని ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోహణ –2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ రోజున ప్రాణాయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారి దైనందిత జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణం లో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి పకృతినీ పునః స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందు కొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునన్నారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక దైవచింతనలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషమన్నారు.ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అని తెలిపారు.
ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ.. వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే అని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందనీ, దీనివలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కాగలదని తెలిపారు. వృక్షారోహణ 2025 అనేటువంటి కార్యక్రమం పకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచేలా శుభారంభం కానున్నదని అన్నారు.
అనంతరం ప్రాణ యోగ ఆశ్రమంలో పరిశుభ్రత పచ్చదనాన్ని భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను దుస్యాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.
ఈ వృక్షరోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, డాక్టర్ సత్యనారాయణరాజు, ఎంపీడీవో ఇందిరమ్మ, డిప్యూటీ తహసిల్దార్ అన్వర్ భాష, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత, వీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.