నేటి సాక్షి గజ్వేల్ :—ప్రజలకు ఊహకందని రీతిలో దేశం అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఆయన పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏడు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడితే అందులో మూడు దక్షిణ భారతదేశానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి దక్షిణ భారతదేశానికి ఎక్కువ నిధులు కేటాయించడమే కాకుండా, రైళ్లకు 15 శాతం, రహదారులకు 10 శాతం అదనపు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. వాజపేయి హయాంలో ప్రారంభించిన జాతీయ రహదారుల వెంబడి రైలు మార్గాల అభివృద్ధి కూడా కొనసాగుతోందన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంటే, కుటుంబ రాజకీయాల కోసం ఒకరిపై ఒకరు మీడియా ముందు విమర్శలు చేసుకుంటూ మోడీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలే ప్రతిపక్ష నాయకులను తిరస్కరించి ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సరిగా అర్థం చేసుకొని మాట్లాడాలని, లేకుంటే రాజకీయంగా నష్టపోతారని టీఆర్ఎస్ నాయకులను ఘాటుగా విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్, నలగమ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌తో పాటు వివిధ వార్డుల బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.





