నేటి సాక్షి, బెజ్జంకి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బలమైన భారత్ నిర్మితమవుతుందని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ మండల సమావేశం మండల అధ్యక్షుడు కొలిపాక రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ రావు, మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిందని కొనియాడారు.పహాల్గాం ఘటనకు ప్రతిగా నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి, పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పిందని భారత్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మోదీ నాయకత్వానిదే” అని చెప్పారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించేలా కార్యకర్తలు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజలతో రచ్చబండల ద్వారా ప్రభుత్వం వైఫల్యాలను చర్చించాలని పిలుపునిచ్చారు. కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూసాధారణ కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్, పార్టీకి, కార్యకర్తలకు, దేశానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు బుర్ర మల్లేశం గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి అనిల్ రావు, మహిళా నాయకురాలు బండిపల్లి సునీత గౌడ్, నాయకులు కొత్తపేట రామచంద్రం, రాచకొండ శ్రీధర్ రావు, దారం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

