నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లోని ప్రముఖ చారిత్రాత్మక పుణ్యక్షేత్రం కోటిలింగాలను యానం తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేపట్టాలని మాజీ ఏఎంసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తిపాక వెంకటేష్ ప్రభుత్వానికి సూచించారు. గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల అవకాశాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రణాళికతో నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వంలో అవి ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది తీరా పర్యటక ప్రదేశమైన యానం ను మిత్ర బృందంతో ఆయన సందర్శించి అభివృద్ధికి కారణమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…యానం తరహా అభివృద్ధి కోసం ప్రధానంగా గోదావరి తీరం వెంట ఉన్నట్లుగా కోటిలింగాల వద్ద కూడా అందమైన ‘రివర్ ఫ్రంట్’ (నదీ తీర నడక దారి) గార్డెన్లు మరియు లైటింగ్ ఏర్పాటు చేపట్టి, బోటింగ్ సదుపాయాలకు పర్యాటకులను ఆకర్షించడానికి గోదావరి నదిలో స్పీడ్ బోట్లు, క్రూయిజ్ ప్రయాణాలు పునరుద్ధరించి, నది మధ్యన తీగలా వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు. శాతవాహనుల మొదటి రాజధానిగా కోటిలింగాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను చాటిచెప్పేలా మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులు బస చేయడానికి హరిత హోటల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, కాటేజీలు నిర్మించాలన్నారు. రవాణా సౌకర్యంకై కోటిలింగాల ముఖద్వారం నుండి రోడ్డును విస్తరించి డివైడర్ తో లైటింగ్ ఏర్పాటు చేసి, పలు ప్రాథమిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉన్న కోటిలింగాలను రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సందర్శించకపోవడం బాధాకరమని, పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోటిలింగాల అభివృద్ధి కోసం దృష్టి సారించి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో యానం రేంజ్‌లో అభివృద్ధి చెందేలా చొరవ చూపాలన్నారు.

