Thursday, March 19, 2026

*యువ వైద్యుల ప్రతిభను చాటిన ‘ఎక్స్‌టసీ–2025’**అపోలోలో ఘనంగా వార్షిక సాంస్కృతిక మహోత్సవం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, నవంబర్‌ 22: అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎఐఎంఎస్ఆర్)లో వార్షిక సాంస్కృతిక మహోత్సవం ‘ఎక్స్‌టసీ–2025’ పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. విద్యార్థుల కేరింతలు, రంగురంగుల వేషధారణలు, సంగీతం–నృత్యాలతో ఉప్పొంగిన ఉత్సాహంతో సాగిన ఈ వేడుకలు వైద్య విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టాయి. వైద్య విద్యలో కఠినమైన అకడెమిక్‌ షెడ్యూల్‌ మధ్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఈ ఉత్సవాలు వేదికగా నిలిచాయి. రెండు రోజులపాటు విద్యార్థుల సృజనాత్మకత, కళాత్మకత, ఉత్సాహభరిత ప్రదర్శనలతో ఎక్స్‌టసీ–2025 పండుగలా సాగింది. స్టూడెంట్ అఫైర్స్ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణదీప్తి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విద్యా, వైద్య రంగాల ప్రముఖులు హాజరై విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ది అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పోతరాజు విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాస పెంపుకు, జీవితాంతం నిలిచే మధుర జ్ఞాపకాలకు వేదికవుతాయని చెప్పారు. భవిష్యత్‌ వైద్యులుగా ఎదుగుతున్న విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు బహుముఖ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న అపోలో హాస్పిటల్స్‌ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ (సిఎఫ్ఓ) రామకృష్ణన్‌ (రామ్‌కీ) మాట్లాడుతూ, వైద్య వృత్తి అత్యంత క్లిష్టమైనదైనప్పటికీ సమాజానికి దేవుడి పని చేసే బాధ్యతగల సేవ అని పేర్కొన్నారు. డాక్టర్‌ అనేది కేవలం ఉద్యోగం కాదు, ప్రతిసారీ ప్రాణాలను రక్షించే పవిత్రమైన సేవ అని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అందించిన నృత్య–సంగీత ప్రదర్శనలు క్యాంపస్‌ను హరివిలాసంగా మార్చాయి. సాంప్రదాయ దుస్తుల్లో జానపద–సాంప్రదాయ నృత్యాలు, పాటలు, సంగీతంతో వేదిక పండుగ వాతావరణంలో కళకళలాడగా, దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశాయి. అదే సమయంలో ఆధునిక నృత్యాలు, సంగీత బృంద ప్రదర్శనలు, సృజనాత్మక యాక్ట్స్ విద్యార్థుల్లోని ఉత్సాహం, కళాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని చాటాయి.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎ ఎచ్ ఇ ఆర్ ఎఫ్) ఫైనాన్స్ కంట్రోలర్‌ అమిత్‌ త్రిపాఠి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.జి. రంగనాథ్, సిఓఓ నరేష్ కుమార్ రెడ్డి. డీన్‌ డాక్టర్‌ ఆల్ఫ్రెడ్ జె. ఆగస్టిన్, అసోసియేట్‌ డీన్స్‌ డాక్టర్‌ రమ్యా రామకృష్ణన్, యూనిట్‌ హెడ్‌ ఎస్‌. బాలరాజ్‌, వివిధ విభాగాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News