నేటి సాక్షి గజ్వేల్ :—సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్‌కు ఆదివారం మహమ్మదీయ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, అత్తెల్లి శ్రీనివాస్ ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రజా నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించడం ఆయన ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు.రంజాన్ పవిత్ర మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సన్మానించడం తమకు ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సమాజంలో ఐక్యత, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు కౌన్సిలర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.అనంతరం కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “హిందూ–ముస్లిం భాయి భాయి” అనే భావనతో అందరం కలిసికట్టుగా జీవించడం ద్వారానే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో మత భేదాలు లేకుండా ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, సామాజిక ఐక్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సామరస్యంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతిన్, జమీల్ మజీద్ కమిటీ ఇమామ్ తో పాటు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు





