నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చెన్నై, తిరుపతి యాక్సెస్ కంట్రోల్ హైవే ప్రాజెక్ట్ ప్యాకేజ్ 2కు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ మార్గంలో గ్రామాలు, కాలనీలు, ప్రభుత్వ సంస్థలు, యాత్రికుల సౌకర్యం దృష్ట్యా అదనంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వెహికల్ అండర్‌పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు వంటి కనెక్టివిటీ సౌకర్యాలు అవసరమని ఎంపీ గతంలోనే కేంద్ర రహదారుల శాఖ దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపధ్యంలో గురువారం పార్లమెంటులో ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇస్తూ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలో ఇప్పటికే రెండు వైపులా సర్వీస్ రోడ్లు, కీలక ప్రాంతాల్లో అనేక వెహికల్ అండర్‌పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, వెహికల్ ఓవర్ పాస్‌లు, ఎంట్రీ, ఎగ్జిట్ ప్రణాళికలో భాగంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.అయితే జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా మెరుగైన కనెక్టివిటీ కోసం ఎంపీ గురుమూర్తి సూచించిన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించింది. ఇందులో భాగంగా తిరుపతి పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని టయోటా షోరూమ్, కొట్రమంగళం వద్ద అదనపు వాహన అండర్‌పాస్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ కొత్త అండర్‌పాస్ సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో తోడ్పడుతుంది. అయితే యాక్సెస్ కంట్రోల్ హైవేల భద్రతా ప్రమాణాల ప్రకారం ఎక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని, అది ట్రాఫిక్ వేగాన్ని నియంత్రిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తాజ్ హోటల్, కలెక్టర్ కార్యాలయం సమీపంలో కోరిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు సాంకేతికంగా సాధ్యం కాదని మంత్రి తెలిపారు. ఇప్పటికే సమీపంలో ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను వినియోగించుకోవచ్చని వివరించారు.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తడుకు, వి.కె.ఆర్.పురం, నేతంకండ్రిగ, పుత్తూరు, అవిలాల, తూకివాకం, ఎలమండ్యం, మల్లవరం, తొండవాడ తదితర అనేక గ్రామాలకు కనెక్టివిటీ కల్పించే నిర్మాణాలు ఇప్పటికే ప్రణాళికలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. తిరుపతి, రేణిగుంట, చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలకు అవసరమైన అన్ని ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు కూడా ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్నయని ప్రభుత్వ సమాధానంలో పేర్కొన్నారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, సాధ్యమైన చోట్ల అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. భద్రతా నిబంధనలు అనుమతించని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు.





