నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యం గా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రారంభించారు. అమరావతి వేదికగా కొద్ది రోజులుగా ఆసక్తి కర నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజాగా అమరావతిలో సమస్యలను ప్రస్తావించిన రైతు రామారావు అస్వస్థతతో మంత్రి సమక్షంలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రైతుల అంశం పైన వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది. అమరావతి పైన తొలి నుంచి వ్యతిరేక ముద్ర వేసుకున్న వైసీపీ లో కీలక మార్పు కనిపిస్తోంది. తాజాగా మందడంలో అమరావతి రైతు మంత్రి నారాయణ నిర్వహించిన సభకు హాజరై రోడ్ల విస్తరణ సమస్య పైన స్పందించారు. ఆ వెంటనే అస్వస్థతకు గురయ్యారు. మంత్రి కాన్వాయ్ లోనే ఆస్పత్రికి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పైన ఇప్పుడు వైసీపీ మంగళగరి ఇంఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి స్పందించారు. రాజధానిలో ఇలాంటి రైతు రామారావులు ఇంకా ఎంతమంది బలైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. సుమారు 30 వేల మంది రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ భూములు, ఇళ్లు తీసుకుంటామని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వకూడదనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భూమిని లాక్కుంటే రైతు ఎంత వేదన చెందుతాడో పాలకులకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు..రైతు రామారావు నుంచి భూమి, ఇల్లు మాత్రమే కాకుండా చివరకు ఆయన ప్రాణం కూడా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒక్క రైతు సమస్యనైనా పరిష్కరించారా అని నిలదీశారు. రైతుల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా అని ప్రశ్నించారు. భూసమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తామని ఎలా చెబుతున్నారని విమర్శించారు. రాజ ధాని పేరుతో రైతుల జీవితాలను పూర్తిగా అగమ్యగోచరం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీల ను అమలు చేయాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రాంతానికి వస్తున్నప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని విమర్శించారు. వెంటనే రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..~~~~~~~~~~~~~~~~~~

