Monday, January 19, 2026

రాజీవ్ యువ వికాస్ పథకం… పకడ్బందీగా అమలు చేయాలి

-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నేటిసాక్షి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె రాజీవ్ యువ వికాస పథకంపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకు కో-ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్ డీఎం శ్రామిక్, డిఆర్డిఓ, ఇంచార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శేఖర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నసీరుద్దీన్, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, వివిధ బ్యాంకు కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, ఇందుకుగాను ప్రతి దశలో ఒక సమయాన్ని నిర్దేశించి ఆ సమయంలోగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు పనిచేయాల్సిందని, ఇప్పటివరకు ఈ పథకం కింద వచ్చిన 73,464 దరఖాస్తులలో బ్యాంకులకు పంపించిన 73,200 దరఖాస్తులను అర్హతను పరిశీలించి, సంబంధిత ఎంపీడీవోలకు వెంటనే ఇవ్వాలని తెలిపారు. బ్యాంకర్లు, బ్యాంక్ మేనేజర్లు అన్ని దరఖాస్తుల అర్హతను పరిశీలించి, ఎంపీడీవోలకు పంపించాలని, ఎంపీడీవోలు వారి స్థాయిలో అన్ని అర్హతలు పరిశీలించి ఈనెల 25 లోగా జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటివరకు బ్యాంకర్లు 11వేల దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి తిరిగి ఎంపిడిఓలకు అందజేయడమే కాకుండా, 6500 దరఖాస్తులను అప్డేట్ చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రామిక్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి, ఎంపీడీవోలకు అందజేస్తామని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల సిబిల్ అర్హత ప్రక్రియ మంగళవారం నాటికి 60 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సిబిల్ అర్హత పరిశీలనలో బ్యాంకర్లు జాప్యం చేసినట్లయితే సమస్యను ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించి పథకం సబ్సిడీ, రుణాన్ని మంజూరు చేసేందుకు గాను వెంటనే ఏలాంటి లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News