నేటి సాక్షి, కరీంనగర్: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు ఎంపికైనట్టు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో అల్ఫోర్స్కు చెందిన బీ సహస్ర రెడ్డి(9వ తరగతి) డీ సుస్మితారెడ్డి(6వ తరగతి) సత్తా చాటి, ఈ నెల 12, 13, 14న మహబూబ్నగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికరయ్యారని చెప్పారు. అల్ఫోర్స్ విద్యార్థులు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఫుట్బాల్ క్రీడ విశ్వ క్రీడ అని, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వివిధ క్రీడల్లో తాము ప్రోత్సహిస్తున్నామని, వారు జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిలో పాల్గొనే వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.