స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చెయ్యడం లేదు…!!!ప్రజల ఇబ్బందులను వెంటనే అరికట్టాలి…!!!సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి జె. రమేష్…!!!నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :వనపర్తి లో రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే అరికట్టాలని సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి జె. రమేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రేషన్ షాపులను సందర్శించారు. బండారు నగర్ రేషన్ షాప్ లో బియ్యం పంపిణీని పరిశీలించి, వినియోగదారులతో ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సక్రమంగా బియ్యం సరఫరా చేయక పలు దుకాణాలు మూతపడ్డాయన్నారు. రేషన్ కార్డులు పట్టుకొని ప్రజలు బియ్యం కోసం కాళ్ళ అరిగేలా తిరుగుతున్నారన్నారు. స్టాక్ ఉన్నచోట గంటలతరబడి క్యూలో నిలబడి చివరికి స్టాక్ లేకపోవడంతో బాధతో ఇంటికి వెళ్తున్నారన్నారు. రేషన్ షాప్ లో క్యూలో చివర ఉన్నవారికి ఈరోజు రేషన్ దొరకలేదన్నారు స్టాక్ వస్తే మళ్లీ పంపిణీ చేస్తామని డీలరు చెప్పారన్నారు. జూన్ జూలై ఆగస్టు మూడు నెలల స్టాకు ఒకేసారి పంపిణీతో ఒక్కొక్కరికి ఇచ్చేందుకు 15 నుంచి 20 నిమిషాలు పడుతోందన్నారు. తగినంత స్టాక్ రేషన్ షాప్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక బియ్యం పంపిణీలో స్టాక్ పాయింట్ నుంచి డీలర్ వరకు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. 50 కిలోల బియ్యం ఖాళీ బస్తా బరువు 568 గ్రాములు ఉంటుందని అధికారులు చెబుతున్నారన్నారు. ఖాళీ బస్తా బరువు పోను 50 కిలోల నెట్ బియ్యం సంచిలో ఉండాలన్నారు. కానీ స్టాక్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్న కొన్ని బియ్యం బస్తాల్లో 44 నుంచి 48 కిలోల బియ్యమే ఉంటున్నాయని డీలర్లు చెబుతున్నారన్నారు. పంపిణీలో ఆ తరుగును భర్తీ చేసుకునేందుకు డీలర్లు ప్రతి కార్డు హోల్డర్ కు అరకిలో ఆ పైగా బియ్యం తక్కువ ఇస్తున్నారన్నారు. చివరకు వినియోగదారుడే నష్టపోతున్నారన్నారు. రేషన్ షాప్ లలో కొందరికి ఈరోజు నాణ్యతలేని బియ్యం ఇచ్చారన్నారు. ఈ అవకతవకలపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలన్నారు. ఈ నెల వరకు జారీ అయిన అన్ని కొత్త రేషన్ కార్డులకు కూడా బియ్యం ఇవ్వాలన్నారు. రేషన్ షాపుల్లో 18 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో అవకతవకలు అరికట్టి, పంపిణీ ఇబ్బందులు తీర్చకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకురుమన్న తదితరులు పాల్గొన్నారు.

