Wednesday, March 18, 2026

*రైతులకు ఇబ్బంది కలిగితే సహించేది లేదు** ధాన్యం కొనుగోలులో పారదర్శకత ఉండాలని ఆదేశం* ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ముఖ్యంగా రైతులకు సేవలందించే విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు. బుధవారం బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో పర్యటించిన ఆయన, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతాన్ని కొలిచే యంత్రాల పనితీరును పరిశీలించారు. నిబంధనల పేరుతో రైతులను గంటల తరబడి నిరీక్షించకుండా వేగంగా సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం అస్సలు ఉండకూడదు. రైతులకు నేరుగా ప్రభుత్వం నుండి నగదు జమ అయ్యేలా ఆన్‌లైన్ ప్రక్రియను పర్యవేక్షించాలి అని సిబ్బందిని హెచ్చరించారు. కేంద్రంలో సరిపడా గోనె సంచులు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ అందుతున్న సేవలపై ప్రజల నుంచి ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరును ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్న సమయాన్ని తనిఖీ చేశారు. ప్రజలు సమర్పించిన అర్జీలు ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించకుండా జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ.. “ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. సామాన్యుడికి ఇబ్బంది లేని పాలన అందించడం. అందుకే నేను స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పనులను పరిశీలిస్తున్నాను. ఈతేరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. సచివాలయ సిబ్బంది కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలి.” గ్రామంలోని రోడ్ల మరమ్మతులు, మురుగు నీటి కాలువల నిర్మాణంపై గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతులు సమర్పించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News