నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 29.:ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మాయదారి తుఫాన్ రైతులను నిండా ముంచింది.. మొంథా తుపాను ప్రభావం వలన మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరప లేకుండా కురిసిన వర్షానికి కూసుమంచి మండలంలోని కూసుమంచి , గట్టుసింగారం ,పాలేరు , తురకగూడెం , జజ్జులరావు పేట ,పెరికాసింగారం , ఎర్రగడ్డ తండా ,దుబ్బతండ వంటి దాదాపు అన్ని గ్రామాలలో వరి పంట పొలాలు నీటితో నిండిపోయాయి.. దీంతో వందల ఎకరాలలో కోతలకు వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి.. ఇప్పటికే గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో రోజు కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న రైతులు తుఫాన్ కారణంగా పూర్తిగా కుదేళ్ళయ్యారు.. వేల రూపాయలు పెట్టుబడి పెట్టీ ఉన్న రైతులకు తుఫాన్ కన్నీరునే మిగిల్చింది.. *నల్లబారిన పత్తి చేనులు.. నేలకొరిగిన మిర్చి..* ఏడాది ప్రారంభంలోనే విడువని వర్షాలతో పత్తి దెబ్బతిన్నది .. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు మొంథా తుఫాన్ ఆ ఆశలను కూడా గల్లంతయ్యాయి.. తుఫాన్ కారణంగా పత్తి కాయలు నల్లభారడంతో , ఎందుకు పనికి రాని పరిస్థితి ఏర్పడింది.. మిర్చి రైతులకు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.. వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైంది.. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి రైతులు కోరుతున్నారు.. *దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఏఓ వాణి..*మొంథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పొలాలను కూసుమంచి వ్యవసాయ అధికారి రామడుగు వాణి పరిశీలించారు.. ప్రాథమికంగా సుమారు 1200 ఎకరాల్లో వరి నేలకొరిగిందని తెలిపారు.. దెబ్బతిన్న వరినీ పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు..





