Thursday, March 19, 2026

*రైతుల ధరల సంక్షోభంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి అడ్జర్న్‌మెంట్ మోషన్.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ధరల సంక్షోభంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ లేకపోవడం వలన దేశవ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టాలలోకి నెట్టబడుతున్నారని ఆయన తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంట ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 50 శాతం అధికంగా కనీస మద్దతు ధర ఇవ్వాలన్న హామీ ఇప్పటికీ అమలుకాలేదని ఆయన విమర్శించారు.విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, విద్యుత్‌, నీరు, రవాణా వంటి వ్యవసాయ వ్యయాలు విపరీతంగా పెరిగినప్పటికీ రైతులకు తగిన ధరలు దక్కడం లేదని ఈ నోటీసులో ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆలస్యమైన చెల్లింపులు, మధ్యవర్తుల దోపిడీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 ఉండగా మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.7 వేలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, టమోటా, అరటి వంటి పంటల ధరలు కిలోకు రూ.1 నుంచి రూ.2కే పడిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు.ఈ పరిస్థితులు కొనసాగితే వ్యవసాయం పూర్తిగా నిలదొక్కుకోలేని స్థితికి చేరుతుందని ఎంపీ హెచ్చరించారు. రైతులను ఆదుకోవడానికి, వారి జీవనాధారాన్ని రక్షించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News