బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆగ్రహం
నేటి సాక్షి, బెజ్జంకి:
రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సహాయాన్ని ఇప్పటికీ అందజేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ, ఈ రోజు బెజ్జంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ
రైతులు పొద్దు తిరుగుడు విత్తనాలు అమ్మిన 3 నెలలు అవుతోంది, ఇంకా డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదని, వెంటనే రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలన్నారు. ఇది రైతు మీద ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని, రైతులు దుక్కిదున్ని విత్తనాలు వేసే సమయం వచ్చినా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. ఇప్పటివరకు మూడు దఫాలుగా రైతు భరోసా బాకీ పడింది. ఇది రైతులపై బూటకపు ప్రేమ చూపే కాంగ్రెస్ ప్రభుత్వ అసలైన వైఖరిని బయటపెడుతోందన్నారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హుల స్థానంలో అనర్హులకే ఇళ్లు కేటాయించడం జరుగుతోందని,కమిటీ పేరుతో డబ్బులు తీసుకొని ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. స్థలం, వ్యాపారం ఉన్న వారికీ, స్థానికంగా లేని వారికి ఇళ్లు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరుగుతుందని మండల ప్రజలంతా బహాటంగానే మాట్లాడుతున్న అధికారులు సమాధానం చెప్పలేక పోతున్నారని, ఈ అవకతవకలపై త్వరలోనే అర్హులైన లబ్ధిదారులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు సిద్ధమవుతామని మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, చింతలపల్లి సంజీవ రెడ్డి, దుంబాల రాజా మహేందర్ రెడ్డి, జెల్ల అయిలయ్య యాదవ్, హన్మండ్ల లక్ష్మారెడ్డి, ముక్కిస రాజిరెడ్డి, గుబిరే మల్లేశం, వంగల నరేష్, ఎల. శేఖర్ బాబు, బిగుళ్ళ మోహన్, మామిండ్ల తిరుపతి, గుగ్గిళ్ళ శంకర్ బాబు, గుగ్గిళ్ళ రాజేష్, బెజ్జంకి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

