నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )రైస్ మిల్లు యజమానులు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ..కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని..వీళ్ల దోపిడీని అరికట్టాలంటే రైసుమిల్లులలో తనిఖీలు పారదర్శకంగా ఉండాలని రైతు రాష్ట్ర నాయకులు ‘ఆకుల రంజిత్’ డిమాండ్ చేశారు.బుధవారం కోరుట్ల పట్టణములోని అష్టలక్ష్మీ దేవాలయములో పాత్రికేయుల సమావేశం ఆకుల రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మధ్య కాలంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.40 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలుమార్లు పత్రిక ముఖంగా ప్రకటించారని గుర్తుచేశారు.రైస్ మిల్లులో ధాన్యం నిల్వలలో అవకతవకల గురించి సమగ్ర విచారణ పారదర్శకమైన వడ్ల నిల్వల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైస్ మిల్లుల మాఫియా వ్యాపారం గురించి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. 2022-23 ఎండ కాలం (రబీ) సీజన్ యొక్క బకాయిలు రాబట్టుటలో రాష్ట్ర పౌరసరఫరాల యంత్రాంగం చాలా ఘోరంగా విఫలమైనదని విమర్శించారు. దీనితో ఈ ఒక్క సీజన్ కు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.4500 కోట్లు నుండి రూ. 5000 కోట్ల మేర బకాయిలు పేరుకపోయి ఉన్నాయన్నారు.ఈ బకాయిలు వసూల్ చేయడంలో విఫలానికి కారణం అధికారులకు, నాయకులకు ఎన్ని ముడుపులు ముట్టి ఉంటాయో స్పష్టమవుతుందన్నారు. 2022-23 ఎండాకాలం, 2024-25 వానాకాలం, 2024-25 ఎండాకాలం మూడు సీజన్ల యొక్క బియ్యం బకాయిలు ముట్టని రైస్ మిల్లులకు 2025-26 వానాకాలం వడ్లను అలాట్మెంట్ చేయడంలో గల అంతర్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.బ్యాంక్ గ్యారెంటీలు రైస్ మిల్లుల టన్నేజి ప్రకారం ఇవ్వకుండా వడ్ల అలాట్మెంట్ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులలో ధాన్యం నిల్వలను పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రెండు పంటలలో రైతులకు బకాయీలు ఉన్న రూ.500లు బోనస్ వరి ధాన్యం డబ్బులను కూడా వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.ఈ పాత్రికేయ సమావేశంలో ఆకుల రంజిత్ తోపాటు కలాల సాయిచంద్, పుల్లగుర్ల కొండల్ రెడ్డి, భీమనాతి శ్రీధర్, సదుల సుదర్శన్, కటుకం రాజేశం, బోయ నర్సారెడ్డి, బోదాసు మహేష్, శేఖర్ మరియు తదితరులు, రైతులు పాల్గొన్నారు._____





