Tuesday, January 20, 2026

*రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి**ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్**రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ*

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ( కోక్కుల వంశీ )రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాల పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి వాహనదారుల వరకూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని పిలుపు ఇచ్చారు. ఓవర్ లోడుతో వాహనాలు వెళ్లకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో తరలించవద్దని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాస, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలని, వివిధ వాహనదారులతో ర్యాలీలు తీయించాలని ఆదేశించారు. రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, వాటి నివారణకు ఆర్ అండ్ బీ శాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర మూలమలుపుల వద్ద సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్, ఏ ఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News