నేటి సాక్షి వికారాబాద్:రోడ్డు భద్రత మాసోత్సవాల’లో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో కలిసి కోడంగల్ ప్రధాన చౌరస్తాలో భారీ మానవహారంగా ఏర్పడి, వాహనదారులకు రోడ్డు నిబంధనలపై ప్లకార్డుల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.సభను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, నేటి సమాజంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “క్షణ కాలం అజాగ్రత్త, మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద తమ కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, భార్యాపిల్లలను గుర్తుంచుకొని వాహనం నడపాలి” అని, ముఖ్యంగా యువత బైక్ రేసింగ్‌లు, విన్యాసాల జోలికి వెళ్లకూడదని, హెల్మెట్ అనేది కేవలం చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కాదని, అది మీ ప్రాణానికి రక్షణ కవచమని స్పష్టం చేశారు.రోడ్డు భద్రత అంశాలను వివరిస్తూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం (డ్రంక్ అండ్ డ్రైవ్), వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం వంటి ప్రాథమిక సూత్రాలను పాటించాలని కోరారు. “రహదారి నిబంధనలు అనేవి శిక్షల కోసం కాదు, మీ క్షేమం కోసం రూపొందించబడ్డాయి. వేగాన్ని మీ మనస్సు ద్వారా యంత్రించుకోవాలి” అని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, తమ ఇంట్లోని పెద్దలు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని వారించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.చివరగా, రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నెల రోజుల కార్యక్రమం మాత్రమే కాదని, అది ప్రతి రోజూ, ప్రతి ప్రయాణంలో అనుసరించాల్సిన ‘జీవన విధానం’ కావాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణ కోసం పాటుపడుతుందని, ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గుర్తింపు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, ఏఎంవిఐ శ్రీ లక్ష్మి, పరిగి డిఎస్‌పి శ్రీనివాస్, పరిగి ఎంవిఐ వేరేంద్ర నాయక్,కోడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, కోడంగల్ ఎస్‌ఐ సత్యనారాయణ, కోడంగల్ లోని లారీ,ఆటొ యూనియన్ సభ్యులు, కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విధ్యార్థులు , సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.

