నేటి సాక్షి మహబూబాబాద్ నరసింహుల పేట (బి. ఆర్. నాయక్) నవంబర్ 6మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) గాడిపల్లి సందీప్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.సమాచారం ప్రకారం, నీలికుర్తి గ్రామానికి చెందిన ఒక రైతు తన పేరుమీద రైతు బీమా పథకం వర్తింపచేయమని గాడిపల్లి సందీప్‌ను అభ్యర్థించాడు. అయితే, తన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉన్నా, సందీప్ పథకం అమలుకై పది వేల రూపాయల లంచం కోరినట్లు తెలిసింది.రైతు దీనిని సీరియస్‌గా తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు పన్నిన ఉచ్చు పన్నులో భాగంగా గురువారం నాడు లంచం మొత్తాన్ని ఇవ్వడానికి రైతు సిద్ధమయ్యాడు. అనుకున్న సమయానికి రైతు అందజేసిన డబ్బు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి గాడిపల్లి సందీప్‌ను రంగే చెయ్యి పట్టుకున్నారు.దీంతో అక్కడ ఉన్న రైతులు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఏసీబీ బృందం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. అధికారులు లంచం రూపంలో స్వీకరించిన నోట్లను రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలాయి.ఏసీబీ అధికారులు తెలిపిన ప్రకారం, “పదివేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవసాయ విస్తరణ అధికారి గాడిపల్లి సందీప్‌పై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతుంది” అని తెలిపారు.గ్రామ ప్రజలు మాట్లాడుతూ, “రైతులకు అందించాల్సిన పథకాలను సొంత ప్రయోజనాల కోసం అడ్డుకుంటూ లంచాలు తీసుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనతో మరిపెడ మండలంలోని ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రైతు బీమా, పంట బీమా వంటి పథకాల అమలులో అవినీతి నడుస్తుందన్న అనుమానాలపై రైతు సంఘాలు కూడా స్పందించాయి.





