నేటి సాక్షి గజ్వేల్…..గజ్వేల్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల లబ్ధిదారులు మరియు భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం నిర్మించిన 1200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 1100 మందికి ఇప్పటికీ ఇళ్లు కేటాయించకపోవడం, పట్టాలు ఇవ్వకపోవడం బాధితులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది.నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నిర్వాసితులైన కుటుంబాలను తాత్కాలికంగా పట్టణ శివారులోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంచారు. అయితే వారికి ఇవ్వాల్సిన పూర్తి నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. కొంతమందికి ఇళ్లు, మరికొందరికి ఓపెన్ ప్లాట్లు కేటాయించగా, ఒంటరి మహిళలు మరియు యువతకు ప్రకటించిన ప్యాకేజీలు కూడా అమలుకాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.దీంతో ఒకే ఇంటిపై లక్కీ డ్రా లబ్ధిదారులు, భూ నిర్వాసితులు ఇద్దరూ హక్కులు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాధితులు మండిపడుతున్నారు.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్ల తాళాలు తొలగించి లక్కీ డ్రా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే చర్యలు చేపట్టినా, నివసిస్తున్న నిర్వాసితులు మాత్రం తమకు పూర్తి నష్టపరిహారం చెల్లించే వరకు ఇళ్లు ఖాళీ చేయబోమని స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వం, అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితులు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. “ఇళ్లు ఇస్తామని చెప్పి నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారు… మా సమస్యను వెంటనే పరిష్కరించాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు.ఇళ్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని బాధితులు హెచ్చరించారు





