నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో విషాదం నెలకొంది. మతిస్థిమితం సరిగ్గా లేక మనస్థాపానికి గురైన ఇందూరి రాములు (45) అనే వ్యక్తి సోమవారం ఉదయం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడి తల్లి ఇందూరి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాములు గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. గతంలో రెండు వివాహాలై విడాకులు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. 2017 నుంచి మతిస్థిమితం తప్పడంతో తల్లి సత్తవ్వ అతనికి చికిత్స చేయిస్తోంది.మందులు వాడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా తరచుగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లడం, జీవితంపై విరక్తితో చనిపోతానని అంటుండేవాడు. సోమవారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో తల్లి సత్తవ్వ ఇంటి బయట ఎండలో కూర్చుంది. ఆ సమయంలో రాములే ఇంట్లో వంట చేస్తున్నాడు. గంట తర్వాత సత్తవ్వ ఇంట్లోకి వెళ్లి చూడగా, రాములు ఇంటి పైకప్పు దూలానికి పగ్గంతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో ఇందూరి రాజు అనే వ్యక్తి వచ్చి పరిశీలించగా అప్పటికే రాములు మృతి చెంది ఉన్నాడు. తన కుమారుడి మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని, మనస్థాపం చెందే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లి సత్తవ్వ రోదనలు మిన్నంటాయి.

