Thursday, March 19, 2026

వయో వృద్ధులు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు తోడ్పాటు అందివ్వాలి

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 19,వయోవృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు మనందరం వారికి తోడ్పాటు అందివ్వాలని నారాయణ పేట ఆర్డీఓ రామచంద్రనాయక్ కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం మహిళా, శిశు,దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వయోవృద్ధుల వేడుకలు -2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంట్లో ఉన్న వయోవృద్ధుడు ఒక జ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళేకేం తెలుసులే అనే ధోరణి అందరిలో ఉంటుందని, ఈ అభిప్రాయాన్ని తాను ఏకీభవిస్తానని అన్నారు. కానీ వారి అనుభవం నేర్పిన పాఠాల ముందు మనం దేనికి సరి తూగం అన్నారు. ఏ తల్లిదండ్రి అయినా తమ పిల్లలు తమ వృద్ధాప్యంలో తమకు ఏదో చేస్తారని ఆశించరని, తమ కొడుకులు గొప్పగా ఉండాలని, కీర్తి ప్రతిష్టలతో జీవించాలని కోరుకుంటారని తెలిపారు. కానీ ఈ మధ్య పత్రికలలో డబ్బు కోసం తల్లి ని చంపిన తనయుడు, ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన తనయుడు అనే వార్తలు వస్తుండటం చూసి ఎంతో బాధ కలుపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో తల్లి తండ్రి, కొడుకు,కోడలు, మనవడు, మనవరాలు ఇలా అందరూ కలసి ఉండటంలో ఉన్న ఆనందం వేరేలా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. వయోవృద్ధులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆర్డీఓ సూచించారు. వయో వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారం సిటిజన్ యాక్ట్ లో ఉందని ఆయన చెప్పారు. పిల్లలకు ఇచ్చిన ఆస్తిని కూడా వయో వృద్ధులు తిరిగి తాము పొందే అవకాశం ఆ యాక్ట్ కల్పిస్తుందని తెలిపారు. అలాగని అందరూ అలా ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ వయో వృద్ధులను పట్టించుకోకుండా, వారి పోషణ భారం చూసుకోకుండా ఉండే వారిపై ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే విచారించి వయోవృద్ధులకు తగిన న్యాయం చేస్తామని ఆర్డీఓ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్ మాట్లాడుతూ.. మీకు, మీ వయసుకు ఉన్న అనుభవం ముందు ఏమీ మాట్లాడలేను అన్నారు. వయోవృద్ధులు తమ శక్తి మేరకు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు, వ్యాయమం, నడక వంటివి చేయాలని, జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక పార్కు కూడా ఉందని గుర్తు చేశారు. వయోవృద్ధులు తమకు ఎలాంటి సమస్య ఉన్నా ఎల్డర్ లైన్ 14567 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.సీనియర్ సిటిజన్స్ ఆత్మారాం ఏడికే, సుదర్శన్ రెడ్డి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి క్లుప్తంగా వివరించారు. ఒకరిద్దరు సీనియర్ సిటిజన్స్ జిల్లా కేంద్రంలో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే అందులో వయోవృద్ధుల సంక్షేమ భవనాన్ని నిర్మించే ఏర్పాటు చేయాలని ఆర్డీఓను కోరారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిథులందరూ బహుమతులను అందజేశారు. కార్యక్రమ అనంతరం వయోవృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, డిపిఆర్ఓ ఎం. ఏ. రషీద్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. మల్లికార్జున్, డీ డబ్ల్యు ఓ ఉద్యోగులు సాయి, డిసిపివో కరిష్మా, చైల్డ్ లైన్ సమన్వయకర్త నర్సింలు, భారతి, సఖి కేంద్రం, వృద్ధాశ్రమం సిబ్బంది, అంగన్ వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News