నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )వరకట్న వేధింపులకు గురిచేసి భార్యపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జగిత్యాల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన రోజాకు అదే గ్రామానికి చెందిన గంగాధర్‌తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం అనంతరం కొంతకాలం సవ్యంగా సాగిన దాంపత్య జీవితం తరువాత గంగాధర్ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించడం ప్రారంభించినట్లు కేసు వివరాలు వెల్లడించాయి.*వరకట్నం కోసం వేధింపులు*గంగాధర్ రోజాను తరచూ తిట్టడం, కొట్టడం చేస్తూ అదనంగా కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త వేధింపులను తట్టుకోలేక రోజా తన ఇద్దరు పిల్లలను తీసుకుని రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో నివసిస్తున్న తన అమ్మమ్మ వద్దకు వెళ్లి అక్కడే ఉండసాగింది. జీవనోపాధి కోసం బీడీలు తయారు చేసుకుంటూ జీవనం కొనసాగించిందని తెలిసింది.*దాడి చేసి ప్రాణహానికి ప్రయత్నం*ఈ క్రమంలో 2013 నవంబర్ 20న రోజా తన ఇంటి వద్ద ఉండగా అక్కడికి వచ్చిన గంగాధర్ ఆమెపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన రోజా అక్క మరియు అమ్మమ్మలను కూడా నిందితుడు బెదిరించినట్లు సమాచారం. దీంతో తన ప్రాణానికి భయం ఉందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.*కోర్టు తీర్పు*బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడు గంగాధర్ (35)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కేసును విచారించిన జగిత్యాల ప్రథమ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ సాక్ష్యాలను పరిశీలించి నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.______





