నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ నవంబర్ 03 (సందెల రాజు)మొంథా తుఫాన్ తో బారీ వర్షాలతో హనుమకొండ లోని పలు కాలనీలు ముంపునకు గురికాగా నష్టం వివరాల నమోదుకు చేపట్టిన సర్వే మూడో రోజు సోమవారం కొనసాగింది. సోమవారం ఉదయం నుండి హనుమకొండ, కాజీపేట పరిధిలోని వరద ముంపునకు లోనైన పలు కాలనీల్లో సర్వే బృందాలు ఇంటింటా వివరాలు నమోదు చేశారు. వరద కారణంగా పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారి వివరాలతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరి ఇంట్లోని వస్తువులు, వాహనాలకు కలిగిన నష్టం వివరాలను బాధిత కుటుంబాల నుండి అడిగి సర్వే బృందాలు ఆన్లైన్ యాప్ లో వివరాలను నమోదు చేశారు. సర్వేలో భాగంగా బాధితులకు జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన ఆస్తి, ప్రాణ, పంట నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు సర్వే బృందాలు కాలనీల్లో వివరాలు నమోదు చేశారు.గుండ్ల సింగారం ఇందిరమ్మ కాలనీ, బట్టుపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, కాకతీయ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 కాలనీలు , రాయపుర, కాపు వాడ, గోకుల్ నగర్, దీన్ దయాల్ నగర్, వీవర్ కాలనీ, కాజీపేట పరిధిలోని నాగేంద్రనగర్ కాలనీ, భగత్ సింగ్ నగర్ కాలనీ, అఫ్జల్ నగర్, ఇతర కాలనీల్లో వరద ముంపు కారణంగా జరిగిన నష్టం పై సర్వే బృందాలు వివరాలు నమోదు చేశారు. వరదలతో జరిగిన నష్టం పై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయడం ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు కానుంది. సోమవారం సాయంత్రం సర్వే పూర్తయింది. సర్వే ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డివిజన్ డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావ్ సింగ్, రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు.





