నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్, ఆత్మకూరు, జగ్గసాగర్, ఇక ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మకపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, తేమ శాతం 17% చేరినపుడు ఆలస్యం లేకుండా రైతుల ధాన్యం సేకరణ జరగాల్సిందిగా ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లులకు తరలించి నిల్వ సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.*చెల్లింపులు–సౌకర్యాలు*కొనుగోలు వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతులకు 24–48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. టార్పాలిన్, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు వంటి పరికరాలు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, హమాలీల కొరత లేకుండా రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ వేగంగా జరగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులు కేంద్రాల్లో తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.*ఎంఎస్‌పీ–బోనస్ వివరాలు రైతులకు తెలియజేత*వరి ధరలను రైతులకు స్పష్టంగా తెలియజేస్తూ, గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369, సన్నరకం వరికి క్వింటాకు రూ. 500 బోనస్ ప్రభుత్వం అందిస్తోందని కలెక్టర్ వివరించారు. అధికారులు తరచూ కేంద్రాలను సందర్శించి సెంటర్ నిర్వాహకులతో సమన్వయం కొనసాగిస్తూ కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో రఘువరన్, ఎమ్మార్వోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.____





