నేటి సాక్షి పాలేరు , నవంబర్ 18 :వరి కొయ్యల కాల్చడం వల్ల భూమి నిస్సారంగా మారుతుందనీ , వాతావరణ కాలుష్యం కలుగుతుందని ఏఓ రామడుగు వాణి అన్నారు.. మంగళవారం కూసుమంచి మండలం కొత్తూరు గ్రామంలో వరి కొయ్యలను తగలబెడుతున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను ఆమె సందర్శించారు.. ఈ సందర్భంగా రైతులకు వరి కొయ్యలను తగలబెట్టడం ద్వారా కలిగే దుష్ప్రభావాలను వివరించారు. వరికొయ్యలను తగలబెట్టడం ద్వారా భూమిలో సేంద్రీయ కర్బన శాతం తగ్గి కొంత కాలానికి భూమి నిస్సారంగా మారుతుందని తెలియజేశారు. ఒక టన్ను వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా 60 కిలోలు కార్బన్ మోనాక్సైడ్ , 1400 కిలోల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలిసిపోతుందని తద్వారా వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోతాయని, భూమిలోని తేమశాతం తగ్గుతుందని తెలిపారు. రైతులందరూ వరి పంట అవశేషాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుందని, భూమికి అవసరమైన పోషకాలు అందుతాయని, సేంద్రియ కర్భన శాతం పెరుగుతుందని తెలియజేశారు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డీకంపోజర్ల వంటివి ఉపయోగించి భూమిలో కలియదున్నాలని సూచించారు. అనంతరం కొత్తూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి , ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.




