నేటి సాక్షి గజ్వేల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవాలయంలో భక్తులకు నిరంతరం మహా ప్రసాదం అందించేందుకు నిర్మించిన శ్రీ విద్యా సరస్వతి అన్న ప్రసాద వితరణ (మహా భోజనశాల) కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, శ్రీ విద్యా సరస్వతి స్వరూపమైన అన్నపూర్ణాదేవి సంపూర్ణ ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. భక్తుల పాలిట అమ్మవారు కొంగుబంగారంగా, కల్పతరువులా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారని పేర్కొన్నారు.విశ్వంలోని సమస్త జీవులకు పోషణ బాధ్యతలు నిర్వహించే తల్లిగా అన్నపూర్ణాదేవి నిలుస్తారని, “అన్న” అంటే ఆహారం, “పూర్ణ” అంటే సంపూర్ణమని వివరించారు. ఆకలి తీర్చే శక్తికి ప్రతీకగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని చెప్పారు.దాతల సహకారం, భక్తుల ఆదరణతో వర్గల్ క్షేత్రం అక్షయపాత్రగా వర్ధిల్లుతోందని, తెలంగాణ జిల్లాల్లోనే సుప్రసిద్ధ ఆలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.

