నేటి సాక్షి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ – ఉట్నూర్ అధికారి యువరాజ్ మార్మాట్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలు (బాలికలు), లక్షెట్టిపేట, జన్నారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు( బాలూరు) లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలలో, వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు, మెనూ ప్రకారం భోజనం పంపిణీ, ఆహారం రుచి, మెనూ అమలు వివరాలు తెలుసుకొని, తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు వండిన ఆహారం రుచిని తెలుసుకొని, కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి, ఆరోగ్య కార్యకర్తలతో లతో ఐ.టి.డి.ఎ. పల్స్ యాప్ పని తీరుపై ఆరా తీశారు. పల్స్ యాప్ పై ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్, సంక్షేమ అధికారి, కామాటీ, వంట పని వారు, పారిశుద్ధ్య, మల్టీపర్పస్ వర్కర్లకు సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజు వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





