నేటి సాక్షి, ఆసిఫాబాద్ :కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సీఎచ్సీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు తదితర ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డా. అయేషా గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ— గత మూడు సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కీలక సేవలు అందిస్తున్న ఈ కార్మికులను భీమ్ ఎస్సీ & ఎస్టీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు ఇప్పటివరకు కల్పించకపోవడం శ్రమదోపిడికి నిదర్శనమన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు చెల్లించాలని, ఇకపై ప్రతి నెల 5వ తేదీలోపు బ్యాంక్ ద్వారా వేతనాలు జమ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించి పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు, జాతీయ సెలవులు మంజూరు చేయాలని కోరారు.డిమాండ్లు అమలు చేయకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పిప్పిరి వెంకటేష్, ఇటాన్కార్ తిరుపతి, ఆసుపత్రి సిబ్బంది దినకర్, చంద్రశేఖర్, జమున, గౌరుబాయి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





