నేటి సాక్షి, అందోల్ : ఆహారాన్ని కల్తీ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ హెచ్చరించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటపూర్లోని జేఎన్టీయూహెచ్ క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాసిరకం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారులు కచ్చితంగా నాణ్యమైన వాటిని విక్రయించాలని సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రి, కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్టీయూహెచ్ బాయ్స్ హాస్టల్ మెస్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫుడ్ సేఫ్టీ, మొబైల్ ప్రయోగశాల సిబ్బందితో కలిసి తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఈ తనిఖీలు వంటగది అపరిశుభ్రంగా ఉండటం, కూరగాయలు కోసే ప్రాంతంలో భరించలేని వాసన రావడం, అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, స్టోర్ రూమ్‌లో ఎక్కువగా ఎలుకలు ఉండటం, మైదా పిండిలో బ్లాక్ బగ్స్ ఉండటం, వంటగది ప్రాంగణంలో, ఆహార వస్తువులు నిలువ ఉండే ప్రాంతంలో ఈగలు ఉండటం, ఫుడ్ హ్యాండ్లర్లు హెడ్ క్యాప్స్, గ్లోవ్స్ అప్రాన్లు ధరించకుండా ఉండటాన్ని తాము గమనించామని చెప్పారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ రికార్డ్‌లు లేకపోవటం, ఆహారం తయారు చేసే పాత్రలు అపరిశుభ్రంగా ఉండటం, వాష్ ఏరియా చెత్త, పాడైపోయిన కూరగాయలతో బ్లాక్ అయి ఉండటం, డైనింగ్ టేబుల్ అపరిశుభ్రంగా ఉండటం, నీటి విశ్లేషణ నివేదిక లేకపోవడం, స్టోర్‌లో ఆహార పదార్దాలు అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా పడి ఉండటం, ముడిసరుకు నాసిరకంగా ఉండటాన్ని గుర్తించినట్టు చెప్పారు. వీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు పేర్కొన్నారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.