నేటి సాక్షి డిసెంబర్ 30, మంచిర్యాలజిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో గల వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ వలియత్ అలీ లతో కలిసి కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని తెలిపారు. వార్డులలో నివాస ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలంగ్గ ఉండే ప్రాంతాలను గుర్తించాలని, పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించి ఉండకుండా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని తెలిపారు. జనవరి 1, 2026 నాడు పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితా తయారు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో త్రాగునీటికి సమస్య రాకుండా నిరంతరం ప్రతి నివాసానికి త్రాగునీరు అందించేందుకు ముందస్తు కార్యచరణ రూపొందించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని, సంబంధిత అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

