– రెండో దశ పరీక్ష తప్పిన అభ్యర్థి
– కన్నీరుమున్నీరుగా విలపించిన మహిళ
నేటి సాక్షి, కరీంనగర్: సోమవారం నిర్వహించిన హాస్టల్ వార్డెన్ పరీక్షకు ఉదయం సరిగా వెళ్లిన అభ్యర్థి, మధ్యాహ్నం పరీక్షకు ఆలస్యం కావడంలో పరీక్షా కేంద్రం సిబ్బంది అనుమతించలేదు. దీంతో సదరు మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం పొద్దున 10 గంటలకు టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బంక శోభ కరీంనగర్ పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలకు చేరుకుంది. మొదటి దశ పరీక్షను సరిగా రాసిన ఆమె, మధ్యాహ్నం పరీక్షకు సరైన సమయంలో హాజరు కాలేకపోయింది. 2.16 గంటలకు అంటే 16 నిమిషాలు ఆమె కేంద్రానికి రావడంతో టీజీపీఎస్సీ అధికారులు పరీక్ష కేంద్రం లోకి అనుమతించలేదు. దీంతో సదరు బాధితురాలు శోభ ఆందోళన చేపట్టింది. అయినా అధికారులు అనుమతించకపోవడంతో తన జీవితం నాశనం చేశారని, సదరు పరీక్షా కేంద్రం నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని, ఆమెను సముదాయించారు. అనంతరం ఆమె తన సమస్యను కలెక్టర్కు విన్నవించేందుకు వెళ్లింది.