నేటి సాక్షి 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి అదనపు డి జి పి మహేష్ భగవత్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, విద్య, వైద్య, పోలీస్, మున్సిపల్, విద్యుత్, రవాణా శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 163 బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష సమయానికి అనుకూలంగా టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ప్రశ్నా, జవాబు పత్రాల సురక్షిత రవాణా కొరకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష ప్రశ్న పత్రాలు తెరిచే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రశ్నపత్రాల రవాణాలో పోలీస్ అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సిబ్బంది, సి సి కెమెరాలు, త్రాగునీరు, మూత్రశాలలు, వెలుతురు సరిపడా ఉండేలా చూసుకోవాలని, ఫర్నిచర్ పరిశీలించుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోనికి మొబైల్ లను అనుమతించడం జరగదని తెలిపారు. క్లాక్ రూమ్, కంట్రోల్ రూమ్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు వార్షిక పరీక్షలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అల్పాహారం పథకం క్రింద సెంట్రాలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కొరకు 21 జిల్లాల నుండి భూ వివరాలు అందించడం జరిగిందని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్షించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో భోజన శాలల పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదనపు డి జి పి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులలో గల పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రథమ సంవత్సరంలో జనరల్ 5 వేల 372 మంది, ఒకేషనల్ 888 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5 వేల 227 మంది, ఒకేషనల్ 830 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. 10వ తరగతి పరీక్షల కొరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 9 వేల 703 మంది రెగ్యులర్, 45 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విద్యార్థినీ, విద్యార్థులు పరీక్ష నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వార్షిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి, ఎస్.యాదయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





