Sunday, January 18, 2026

వార్షిక రుణ ప్రణాళిక.. రూ.10182.70 కోట్లు..

  • – ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి..
  • – ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు రూ.9954.20 కోట్ల రుణాలు మంజూరు
  • – బ్యాంకర్లు అత్యుత్తమంగా పని చేయాలి
  • – నిబంధనలు అతిక్రమించవద్దు
  • – గ్రామీణ ప్రాంతాలకు సేవలు మరింత విస్తృత పర్చాలి..
  • – సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
  • – కరీంనగర్ ​జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
  • – వివిధ పథకాల రుణ లక్ష్య పురోగతిపై అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష
  • – రాష్ట్రంలో పీఎంఎఫ్ఎంఈ, బ్యాంకు లింకేజీలో కరీంనగర్ జిల్లాకు రెండోస్థానం
  • – అధికారులు, బ్యాంకర్లకు కలెక్టర్ అభినందన

నేటి సాక్షి, కరీంనగర్​: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10182.70 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు పలు పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై డీసీసీ, డీఎల్ ఆర్ సీ సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించిన బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అవసరాల కోసం రూ.3673.92 కోట్లు, ఎంఎస్‌ఎంఈ కింద రూ.2997.06 కోట్లు, విద్యా రుణాలు రూ.44.55 కోట్లు, గృహ రుణాలు రూ.192.00 కోట్లు, ఇతర రంగాలకు గానూ రూ.3275.17 కోట్ల రుణాలను బ్యాంకర్లు అందించాలని ఆదేశించారు.
2023 -24 ఆర్థిక సంవత్సరంలో 9927 స్వయం సహాయ బృందాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 64,049.25 లక్షలు అందించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి 31 31 నాటికి 12010 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ. 77021.92 లక్షల బ్యాంకు లింకేజీ అందించి 120.25 శాతం లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా రెండవ స్థానం సాధించిందని వెల్లడించారు. ఇందుకు అధికారులు, బ్యాంకర్లను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.

బ్యాంకర్లు వినియోగదారులు, రైతులకు అత్యుత్తమంగా పనిచేయాలని సూచించారు. రైతులకు పంట రుణాలను అందించాలని, ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామ గ్రామాన సేవలు మరింత విస్తృత పర్చాలని, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తద్వారా బ్యాంకర్లకు మంచి పేరు వస్తుందని తెలిపారు. వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ అమాయక ప్రజలు సైబర్ నేరాల్లో చిక్కుకోకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లకు వచ్చే గుర్తుతెలియని మెసేజ్లను ఓపెన్ చేయవద్దని సూచించారు. ప్రధానమంత్రి ఫార్మాలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్ఎంఈ)పథకం క్రింద 180 లక్ష్యం కాగా జిల్లాలో 210 యూనిట్లను గ్రౌండింగ్ చేశామని తెలిపారు. వివిధ కార్యకలాపాల క్రింద బేకరీ, స్పైసస్, ఫ్లోర్ మిల్, రోస్టర్ మెషిన్, దాల్ మిల్, బియ్యం ఆధారిత ఉత్పత్తలు తదితర యూనిట్లను గ్రౌండింగ్ చేశామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చేయూతను అందించేందుకు బ్యాంకర్ల ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగా హన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పంట రుణాలను అందించాలని పేర్కొన్నారు.

ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 నెల వరకు రూ. 9954.20 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు గానూ రూ. 4234.16 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 1763.02 కోట్లు, విద్యా రుణాలకు రూ.18.23 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ.299.61 కోట్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు రూ.770.22 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి రూ. 2938.96 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 133.04 శాతం పూర్తయిందని, పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద రుణాలు తీసుకున్న లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించేలా ఆయా శాఖల అధికారులు జిల్లాలో రుణాల రికవరీపై ప్రత్యేక చర్యలు ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని సూచించారు.

జిల్లాలో ప్రధానమంత్రి స్వానిది కింద మొదటి, రెండవ, మూడవసారి రుణం దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు.
బ్యాంకర్లు నియమ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి బీ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, డీఆర్డిఓ శ్రీధర్, మెప్మా ఇన్చార్జి పీడీ స్వరూపా రాణి, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ఆర్బిఐ అధికారి పల్లవి, నాబార్డ్ డీడీఎం దిలీప్, ఎస్బిఐ ఏజీఎం వెంకటేష్, చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, యుబీఐ ఏజీఎం సురేశ్, చీఫ్ మేనేజర్ కలీం, టీజీబీ ఆర్ ఎం బాల నాగు, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు, చేనేత శాఖ ఏడి చరణ్, అడిషనల్ డిఆర్డిఏ సునీత, అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, కోఆర్డినేటర్స్, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News