Thursday, March 19, 2026

విత్తనాల కంపెనీ కాలుష్యంతో రైతు మృతి చిత్తనూరు విత్తనాల కంపెనీ రద్దు చేసే వరకు పోరాడుతాం….. తెనాలి కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు బండారి లక్ష్మయ్య…..

నేటి సాక్షి, నారాయణపేట,అక్టోబర్ 28,నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో తేది:27-10-2025న పట్టి నర్సింలు 52 సం.లు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అకాలంలో మరణించారని మంగళవారం చిత్తనురు విత్తనాల కంపెనీ పోరాట కమిటీ సభ్యులు బండారి లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు పట్టి వెంకటమ్మ,పట్టి నాగప్పలు కూడ అనారోగ్యంతో అకాల మరణం చెందారు.ప్రస్తుతం ఆయన భార్య అంజమ్మ 45 సం.లు,ఇద్దరు కొడుకులు నవీన్ 19 సం.లు,కురుమూర్తి 17 సం.లు, ఒక చెల్లెలు యశోధ 45 సం.లు(ఎక్లాస్పూర్ గ్రామంలో దాసు భార్య) ఉన్నారు. ఆ కుటుంబానికి రెండెకరాల మాగాణి భూమే జీవనాధారం.నర్సింలు నాయన చాలా సంవత్సరాలు పైకులాల దగ్గర జీతం చేశాడు.అమ్మ కూలీ పనులు చేసింది.అంతేగాక తమ ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంను ఊడ్వడం తూడ్వడం కూడ చేసేవారు.బహుశా దైవ సేవలో కొనసాగితే తమ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో బ్రతుకుతుందనే విశ్వాసంతో వారు బ్రతికారు.తమ తల్లిదండ్రుల దైవ సేవా వారసత్వాన్ని నర్సింలు కూడ కొనసాగించాడు.ఆయన తల్లిదండ్రుల నుండి దైవ సేవయేకాదు పేదరికం,అనారోగ్యాలను కూడ వారసత్వంగా పొందాడు.2022 సం.లో చిత్తనూరు,ఎక్లాస్పూర్,జిన్నారం మూడు గ్రామాల మధ్యలో ఇథనాల్ కంపెనీ పెట్టారు.ఆ కంపెనీ ప్రజలకు మేలు చేసేది కాదని కీడు చేస్తుందని తెలుసుకున్న బాధిత ప్రజలు ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని పోరాటం మొదలు పెట్టారు.ఆ పోరాటంలో పట్టి నర్సింలు క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యాన్ని నిలుపుదల చేయాలని 2023 అక్టోబర్ 22న కంపెనీ ఎదురుగా ఎక్లాస్పూర్ గేటు దగ్గర మూడు గ్రామాల ప్రజలు ఆందోళనకు పూనుకున్నారు. ఇథనాల్ కంపెనీ మా ప్రాంతంలో వద్దే వద్దు, దానిని ఎట్టి పరిస్థితులలో రద్దు చేయాలని జరిగిన పోరాటంలో పట్టి నర్సింలు నీతి, నిజాయితీ, అంకిత భావంలతో పాల్గొన్నాడు.రెండు సంవత్సరాలు నిరంతరాయంగా జరిగిన ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో వేలాది మంది ప్రజలు పాల్గొని తమ ఐక్యతను బలంగా చాటారు.దానితో భయాందోళనకు గురైన వివిధ గ్రామాల పెత్తందారులు,పాలక పక్ష, ప్రతిపక్ష పార్టీల నాయకులు,ప్రభుత్వ అధికారులు,పోలీస్ అధికారులు అందరూ కలిసి సంఘటిత ఇథనాల్ వ్యతిరేక ప్రజాపోరాటాన్ని అణచివేయాలని మూకుమ్మడిగా కుట్ర పన్నారు.ఆ కుట్రలో భాగంగా 2023 అక్టోబర్ 22న చేపట్టిన ప్రజాందోళనపై పోలీసులు లాఠీఛార్జ్ కు పాల్పడ్డారు.అంతేకాకుండా బాధిత గ్రామాలపైబడిన వందల మంది మగ పోలీసులు, మహిళలు అనే విచక్షణ లేకుండా అందరిపై దాడులు చేశారు.ఆ దాడిలో పట్టి నర్సింలు విపరీతంగా గాయపడ్డాడు.పోలీసులు పోరాటకారుల ఇండ్లను చూపించమని కిందపడేసి లాఠీలతో విపరీతంగా కొట్టినా,కడుపులో తొక్కినా ఏమాత్రం జంకలేదు బెంకలేదు. ఎవరి ఇళ్లను చూయించకుండా పోలీసులకు సహాయ నిరాకరణ చేసినందుకు దానిని సహించలేని పోలీసులు వివిధ స్టేషన్ లలో అక్రమంగా నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.అక్రమ కేసులు బనాయించి మహబూబ్ నగర్ జైల్లో 15 రోజులు ఉంచారు. ఇప్పటికీ ఆ కేసులో మహబూబ్ నగర్ జిల్లా సెషన్ కోర్టుకు సహచర పోరాటకారులతోపాటు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఇథనాల్ రద్దు పోరాటం, పోరాట కమిటీ ప్రతినిధులు అంటే పట్టి నర్సింలుకు అమితమైన ప్రేమాభిమానాలు,గౌరవం ఉండేవి.దీర్ఘ కాలంగాఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడుతున్న నర్సింలుకు ఇథనాల్ కంపెనీ నుండి వెలువడుతున్న విపరీతమైన దుర్వాసన కూడ తోడు కావడంతో ఆయన ఆరోగ్యం బాగు పడకపోగా మరింత దిగజారింది.పేదరికంలో ఉన్న కుటుంబంలో ఎదుగుతున్న పిల్లలకు పెద్దదిక్కుగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో నర్సింలు ఆకస్మికంగా అనారోగ్యంతో మరణింండం చాలా బాధాకరం.విషాదకరం.నర్సింలు యొక్క అకాల మరణం ఆయన కుటుంబానికే కాదు సమాజానికి,ఇథనాల్ కంపెనీ రద్దు పోరాటానికి తీరని లోటు.ఆయనలో ఉన్న నీతి,నిజాయితీ,ప్రజల పట్ల ప్రేమ,పోరాటాల పట్ల అంకితభావం, గౌరవం ,త్యాగ బుద్ధి లాంటి ఉన్నతమైన విలువలను ఎత్తిపట్టడమే కాదు మనమంతా వాటిని అలవర్చుకోవలసిన అవసరం ఉంది.ఈ బాధాకర సమయంలో నర్సింలుకు నివాళులు అర్పిస్తూ,ఆయన కుటుంబానికి మా సహానుభూతి,ప్రగాఢ సంతాపాలను తెలియజేస్తున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News