నేటి సాక్షి, ఎండపల్లి:* పెళ్లిరోజును ఆడంబరాలకు కాకుండా సేవకు అంకితం చేస్తూ.. మండలంలోని చర్లపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శేరే జ్యోతి–మహేష్ దంపతులు గురువారం ఏకరూప దుస్తులను (టీషర్ట్స్) అందించిన కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందనే ఉద్దేశంతో తమ పెళ్లిరోజును విద్యార్థుల సేవకు అంకితం చేశామని దంపతులు తెలిపారు. సమాన వేషధారణతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, విద్యపై మరింత ఆసక్తి ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసి, తమ వివాహ వేడుకలను విద్యార్థుల మధ్య నిర్వహించుకుని మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం మాట్లాడుతూ.. దంపతుల దాతృత్వం ఆదర్శనీయమని, యూనిఫామ్ల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడిదం మొగిలి, అల్గం తిరుపతి, ఉపాధ్యాయులు కర్ణాకర్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు కడారి పద్మ, తదితరులు పాల్గొన్నారు.





