నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధారికత మంత్రిత్వ శాఖ వారి ఆదేశానుసారం ,గౌరవనీయ జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లా డిజేబుల్డ్, ట్రాన్స్ జెండర్స్ & సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో “నషా ముక్త్ భారత్ అభియాన్ “ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా జాతీయ స్థాయిలోనిర్వహించబడుతున్న “ఈ-ప్లెడ్జ్” కార్యక్రమంలో భాగంగా స్థానిక బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేయబడిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిహెచ్ సువార్త – అసిస్టెంట్ డైరెక్టర్-డిజేబుల్డ్, ట్రాన్స్ జెండర్స్ & సీనియర్ సిటిజన్స్ హాజరై విద్యార్థులంతా మత్తు పానీయాలకు దూరంగా ఉండి విద్య మీదనే తమ దృష్టిని కేంద్రీకరించి జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎం రమాదేవి (ప్రిన్సిపాల్ -బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ )అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా హాజరైన బి.వెంకటేశ్వర్లు (ఎక్సైజ్ సూపరింటెండెంటు )మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. మరొక విశిష్ట అతిథి ఎండి సాధిక్ (జిల్లా సైన్స్ అధికారి)మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విలువలు,క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని అవలంబిస్తూ మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని కోరారు. మరొక అతిథి కే శ్రీనివాసరావు (రూరల్ సీఐ బాపట్ల) తమ ప్రసంగంలో మత్తు పదార్థాలు సేవించే వారికి చట్టపరంగా తీసుకొనే చర్యల గురించి తెలియజేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డి. నిరంజన్ గారు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులంతా చక్కటి క్రమశిక్షణతో మెలిగి జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రముఖ ట్రైనర్ మరియు సైకాలజిస్ట్ శ్రీ పీ. అన్వేష్ మాట్లాడుతూ ఇంద్రియ నిగ్రహం మీద పట్టు సాధించడం ద్వారా మత్తు నుండి దూరంగా ఉండవచ్చునని సూచించారు. మరొక ట్రైనర్ యస్ డి.మతీన్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మనిషిని శారీరకంగా,నైతికంగా ,సామాజికంగా, ఆర్థికంగా దిగజారుస్తాయని వాటి బారినపడి జీవితాన్ని నరకమయం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ప్రతినిధులు దుర్గాప్రసాద్ , సురేష్ పాల్గొన్నారు . డీ.ఎస్. రజియా ( ప్రిన్సిపాల్- ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల వెదుళ్ళపల్లి ) పాల్గొన్నారు. ఎస్ డి. నాగూర్ బాష శ్రీ చైతన్య కళాంజలి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఇంటిగ్రేటెడ్ రిహబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్) చిన్నగంజాం మాట్లాడుతూ తమ రిహాబిలిటేషన్ సెంటర్ నందు మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పూర్తి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలతో వైద్య మరియు మానసిక చికిత్సలను అందించడం ద్వారా ఆ జాడ్యం నుండి విముక్తుల్ని చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చటం జరుగుతుందని ఎవరైనా ఈ విధంగా మత్తు పానీయాలకు బానిసలు అయిన వ్యక్తులు ఉంటే వారిని తమ సెంటర్లో చేర్పించవలసిందిగా కోరారు.





